Saturday 6 July 2013

డబ్బు-జీవితం

డబ్బు. రెండక్షరాలే. కానీ ప్రపంచాన్ని చుట్టేస్తూనే అదే ప్రపంచాన్ని గిరగిరా తిప్పేస్తుంది. మనిషి డబ్బు అనబడే మారకాన్ని తయారు చేసి కొంత మంచి చేశాడు, ఆ మంచితోపాటు అన్నీ జాడ్యాలూ దాని వెంబడే ఉన్నాయని కనిపెట్టలేకపోయాడు. డబ్బుకోసం హత్య. ఇల్లు గుల్ల చేసిన దొంగలు. డబ్బుకోసం అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు, తండ్రి, స్నేహితుడు ఆఖరికి తల్లిని కూడా చంపుకునే స్థితిలో ఈనాటి సమాజం ఉంది. డబ్బును డబ్బులాగే చూసేవాళ్ళు, అవసరంకోసం మాత్రమే డబ్బు సంపాదించేవాళ్లు, ఇంకొకరికి అన్యాయం చేయకుండా డబ్బు సంపాదించి దాన్ని అనుభవించేవాళ్లు ఉన్నారు ఈ లోకంలో. వాళ్ళందరూ నోటు నీలి నీడ కింద కప్పబడిపోతారు. వాళ్ళలో ఉన్న మంచి, డబ్బు వల్ల, డబ్బుకోసం జరిగే అన్యాయాల మాటున కనీకనబడకుండా ఉండిపోతుంది. Man created money and at the very same moment laid path to the moral destruction of mankind.

మనిషి డబ్బును తయారు చేశాడే కానీ అదే సమయంలో మనుషులలో నైతిక విలువల పతనానికి పునాదులు పడ్డాయని గ్రహించలేకపోయాడు. నా జీవితంలో కూడా డబ్బు చాలా పెద్ద పాత్ర పోషించింది. అది మంచా లేక చెడా అన్నది నేను చెప్పలేను. కానీ చాలా ప్రభావవంతమైన పాత్ర పోషించింది డబ్బు, నా జీవితంలో. నా చదువు, నా ఆకాంక్షలు, ఆశలు, భవిష్యత్తు, ఆఖరికి ప్రేమ కూడా డబ్బుతోనే ముడిపడిపోయింది. ఎక్కడ చూసినా డబ్బు డబ్బు డబ్బు. అదొక మైకం, అదొక చీకటి పరదా, అదొక అడ్డుతెర, అదే సమయంలో అత్యవసరం. డబ్బు జూలు విదిలిస్తే కొన్ని ప్రాణాలు క్షణాల్లో గాలిలో కలిసిపోతాయి, కొన్ని శీలాలు కాగితం చింపిన చందంగా ముక్కలైపోతాయి, కొన్ని కుటుంబాలు దీపం ఊదేసినంత సులువుగా ఆరిపోతాయి, ఒక సామాన్యుడి ఆశలు ఆవిరైపోతాయి, అంతేకాదు ఊళ్ళు, రాష్ట్రాలూ, దేశాలూ, చివరికి ప్రపంచాన్ని కూడా తృటిలో నాశనం చెయ్యగల సాధనం డబ్బు. ఎంత ఆలంబననిస్తుందో, ఎంత ఎత్తున నిలబెడుతుందో అంతగానూ దిగజారుస్తుంది, కిందకు నెట్టేస్తుంది. డబ్బు లేకపోవడం వల్ల నా జీవితంలో నేను చాలా కోల్పోయాను. నాకిష్టమైన చదువు, నాకిష్టమైన పనులు, నాకిష్టమైన అమ్మాయి ఇలా అన్నీ.

ఏ కాలంలోనైనా తెలివైన వాడు అవకాశాలను సృష్టించుకుంటాడేమో, కానీ ఈ కాలంలో మాత్రం ఆ అవకాశాలు డబ్బుతో ముడిపడి ఉన్నాయి. At the end of the day every opportunity is executable only with money. ఒకరి దగ్గర డబ్బు ఉందంటే వాడి జీవితంలో అన్నీ వాడి కాళ్ళముందుకు వస్తాయి, అప్పుడు కూడా సద్వినియోగం చేసుకోకపోతే అది వాడి పొరపాటు. మళ్ళీ ఇది వేరే విషయం. ముందు అవకాశం దొరకడం తర్వాత డబ్బు చేతిలో ఉండడం మాత్రమే ఇక్కడ పని చేస్తుంది. అయితే డబ్బు ఉండడం మాత్రం ప్రధానం. చదువు లేకపోవడమైనా, అందంగా లేకపోయినా లేక ఇంకే లోపం ఉన్నా రూపాయి కాసుల మిలమిలల పచ్చనోట్ల ఫెళఫెళల ముందు దిగదుడుపే. జీవితం సాఫీగా గడిచిపోయిన వాళ్ళను నేను చాలా మందిని చూశాను. అన్నీ వాళ్ళు కోరుకున్నట్టు జరుగుతాయి. పెద్ద కాలేజీల్లో చేరతారు, ఇంజనీర్లో డాక్టర్లో అవుతారు. చక్కగా వేలు, లక్షలు, కోట్లు సంపాదిస్తారు. అంతే స్థాయిలో చదివేవాళ్లు చాలా మంది ఉండవచ్చు గాక కానీ వాళ్ళకు డబ్బుండదు. వాళ్ళు ర్యాంకులు సంపాదించినా లాభముండదు. చదవగలిగినా ప్రయోజనముండదు.

ఈ డబ్బు అనే పదార్థం ఇంకా చాలా చమక్కులు చూపిస్తుంది....

దీన్ని చక్కగా నియంత్రించగలిగితే సర్వసుఖాలూ దిగి వస్తాయి....

అంతే స్థాయిలో చుక్కలు కూడా కనిపిస్తాయి....

“చుక్కలు” అంటే ఏమిటో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదనుకుంటాను....


ఇదంతా చదివిన తరువాత నాకు డబ్బంటే ఇష్టం లేదనుకోకండి. 

డబ్బుపై నాకు కోపమూ లేదు. అయిష్టమూ కాదు. అలాగని వ్యామోహమూ లేదు. 

ఎందుకంటే డబ్బుకు ప్రాణం లేదు.... 

No comments:
Write comments